ఉమర్‌.. మా డబ్బులు మాకిచ్చేయ్‌!

కరాచీ: ఇటీవల పాకిస్తాన్ సీనియర్‌ క్రికెటర్‌ ఉమర్ అక్మల్‌ను సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌ క్రికెట్ బోర్డు  (పీసీబీ) అవినీతి నిరోధక నియమావళిలోని ఆర్టికల్ 4.7.1 కింద అక్మల్‌ సస్పెండ్‌ అయ్యాడు. గతంలో పీఎస్‌ఎల్‌ ఆడే క్రమం‍లో తనను ఒక బుకీ సంప్రదించిన విషయాన్ని దాచి పెట్టిన కారణంగానే అక్మల్‌పై నిషేధం విధించారు. అక్మల్‌పై విచారణ పూర్తయ్యే వరకూ అతను ఎటువంటి కార్యకలాపాల్లో పాల్గొనకుండా పీసీబీ ఆదేశాలు జారీ చేసింది. దాంతో ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌)ను అక్మల్‌ మిస్సయ్యాడు. పీఎస్‌ఎల్‌ క్వెట్టా గ్లాడియేటర్స్‌కు ప్రాతినిథ్యం వహించాల్సిన అక్మల్‌ సస్పెన్షన్‌ కారణంగా ఆ లీగ్‌కు దూరం కావాల్సి వచ్చింది. దాంతో అక్మల్‌కు మరో తలనొప్పి ఎదురైంది. (ఇక్కడ చదవండి: అక్మల్‌ను సస్పెండ్‌ చేశారు..!)




పీఎస్‌ఎల్‌ ఆడటానికి తాము ముందుగా ఇచ్చిన అడ్వాన్స్‌ను తిరిగి ఇచ్చేయాలంటూ గ్లాడియేటర్స్‌ స్పష్టం చేసింది. ఈ మేరకు పీఎస్‌ఎల్‌ నిర్వహిస్తున్న పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుకు విన్నవించింది. ‘అక్మల్‌ సస్పెండ్‌ అయిన కారణంగా అతనికి చెల్లించిన 70శాతం డబ్బును తిరిగి ఇచ్చేయండి. అతను చేసుకున్న కాంట్రాక్ట్‌లో భాగంగా చెక్‌ రూపంలో చెల్లించాం. దాన్ని పీసీబీ ద్వారానే సదరు క్రికెటర్‌కు అందజేశాం.  దాంతో ఉమర్‌కు అందజేసిన డబ్బులు విషయంలో పీసీబీదే బాధ్యత’ అని ఫ్రాంచైజీ అధికారి ఒకరు తెలిపారు. పీఎస్‌ఎల్‌లో ఆటగాళ్ల నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు నగదును క్రికెట్‌ బోర్డు ద్వారానే ఇప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్మల్‌కు 70 శాతం కాంట్రాక్ట్‌ మొత్తాన్ని చెల్లించారు. (ఇక్కడ చదవండి: ‘జీవితకాల నిషేధం విధించండి’)